భారత్‌తో యుద్ధానికి మేం సిద్ధం.. ఆర్ఎస్ఎస్ హిట్లర్ బాటలో వెళ్తోంది : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

 • 15 ఆగస్టు 2019
ఇమ్రాన్ ఖాన్ Image copyright Getty Images

భారత్‌తో యుద్ధానికి తమ దేశం పూర్తి సింసిద్ధంగా ఉందని, ఇటుకలు వేస్తే తాము రాళ్లతో బదులు చెప్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని సవరించడం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఆఖరి అస్త్రం ప్రయోగించారని, తదుపరి ఆయన చూపు కశ్మీర్ స్వాతంత్ర్యంపైనేనని ఆయన చెప్పారు. పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌పై చర్యలు తీసుకునేందుకు భారత్ ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు.

పాక్ పాలిత కశ్మీర్‌ 'అసెంబ్లీ'లో బుధవారం ఈ మేరకు ఇమ్రాన్ ప్రసంగించారు. ఆర్టికల్ 370 సవరణ నేపథ్యంలో ఈసారి తమ స్వాతంత్ర్య దినాన్ని (ఆగస్టు 14) పాక్ 'కశ్మీర్ ఐక్యత దినం'గా జరుపుకొంది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను జర్మన్ నియంత హిట్లర్‌కు చెందిన నాజీ పార్టీతో ఇమ్రాన్ పోల్చారు. ఆర్‌ఎస్ఎస్ భావజాలం ప్రకారమే భారత్‌లో అంతా జరుగుతోందని అన్నారు.

Image copyright AFP

''ఆర్‌ఎస్ఎస్‌లో చిన్నప్పటి నుంచి మోదీ సభ్యుడు. హిట్లార్ నాజీ పార్టీ నుంచి ప్రేరణ పొందిన సంస్థ అది. నాజీల తరహాలోనే ముస్లిం జాతిని తుడిచిపెట్టాలన్నది ఆర్‌ఎస్ఎస్ భావజాలంలో భాగం. క్రైస్తవులపైనా వారికి విద్వేషం ఉంది. 600 ఏళ్లపాటు ముస్లింలు తమను ఏలకపోయి ఉంటే, భారత్ గొప్పగా ఉండేదని ఆర్ఎస్ఎస్ తమవారిని నమ్మిస్తోంది. ఇదే భావజాలంతో మహాత్మ గాంధీని హత్య చేశారు. ముస్లింలను ఊచకోత కోశారు'' అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

ఐదేళ్లుగా కశ్మీర్‌లో జరుగుతున్న దుశ్చర్యలకు ఆర్ఎస్ఎస్ భావజాలమే కారణమని ఇమ్రాన్ అన్నారు.

‘‘యూధులను అంతం చేసేందుకు హిట్లర్ నాజీల కోసం ఫైనల్ సొల్యూషన్ రూపొందించాడు. కశ్మీర్ విషయంలోనూ మోదీ ఉపయోగించిన అస్త్రం ఫైనల్ సొల్యూషన్ లాంటిదే. ఇది ఆయన ఆఖరి అస్త్రం. పెద్ద రాజకీయ తప్పిదం. దీనికి మోదీ, బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మొదటి సారి వాళ్లు కశ్మీర్‌ను అంతర్జాతీయ అంశంగా మార్చారు'' అని చెప్పారు.

''గతంలో కశ్మీర్ విషయం గురించి మాట్లాడటం కష్టంగా ఉండేది. ఇప్పుడు ప్రపంచం దృష్టి ఈ అంశంపై పడింది. దీన్ని అంతర్జాతీయ అంశంగా ఎలా మార్చాలన్నది మన మీదే ఆధారపడి ఉంది. కశ్మీర్ గురించి ప్రపంచానికి వాణి వినిపించే అంబాసిడర్‌గా ఉంటానని ఈ అసెంబ్లీకి నేను హామీ ఇస్తున్నా'' అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

Image copyright PID_GOV/TWITTER

ఇమ్రాన్ ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

 • చరిత్రలో మతి తప్పినవాళ్లు, అనాగరికులే ఊచకోతలకు తెగబడ్డారు. కర్మ, నిర్వాణ లాంటి అంశాలను నమ్మే దేశంగా ప్రపంచం భారత్‌ను చూస్తుంది. మనల్ని ఉగ్రవాద దేశమని, భారత్‌ను సహనశీల దేశమని అంటుంటారు. అందుకే, ఆర్ఎస్ఎస్ భావజాలంతో అత్యంత నష్టపోయే దేశం ఏదైనా ఉందంటే, అది భారతే.
 • భారత రాజ్యాంగాన్నే వీళ్లు రద్దు చేశారు. జమ్మూకశ్మీర్ హైకోర్టు, సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా వెళ్లారు. దేశం యుద్ధాల వల్ల నాశనం కాదు, పాలన దెబ్బతినడం వల్ల అవుతుంది. భారత్‌లో అంతా భయం వ్యాపించి ఉంది. మీడియాను నియంత్రిస్తున్నారు. అక్కడి విపక్షాల నేతల మాటల్లో భయం కనిపిస్తోంది. నాజీ జర్మనీలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి. తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిని దేశ ద్రోహులని అనేవారు. వాళ్లని తరిమేవారు, చంపేసేవారు. భారత్‌లో ముస్లింలు ఏదైనా అంటే, వాళ్లను పాకిస్తాన్ వెళ్లిపొమ్మని అంటారు. మేధావులు కూడా అక్కడ భయపడుతున్నారు.
 • భారత్‌ను వినాశనం దిశగా తీసుకువెళ్తున్నారు. ఆ దేశంలో 18 నుంచి 19 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. భయపెడితే, అధికారాలు లాక్కుంటే వారు ఎదురుతిరుగుతారు. ఇంగ్లాండ్‌లో మాంచెస్టర్, బర్మింగ్హమ్‌లో ఇలాగే జనాలపై ఒత్తిడి పెడితే, వాళ్లు ఛాందసవాదులుగా తయారయ్యారు. భారత్‌లోనూ ఇదే జరుగుతోంది.
 • భారత్‌లో క్రికెట్ ఆడేందుకు వెళ్లినప్పుడు అక్కడున్న ముస్లింలు 'టూ నేషన్ థియరీ' సరైంది కాదని అంటుండేవారు. కానీ, ఇప్పుడు అందరూ జిన్నానే సమర్థిస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా లాంటి భారత్‌ను సమర్థించే కశ్మీరీ నేతలు కూడా ఇప్పుడు ఇదే అంటున్నారు. జిన్నా లేకపోతే మనం కూడా అక్కడ బానిసలుగా బతకాల్సి వచ్చేది.
 • ఆర్ఎస్ఎస్ దీపం నుంచి బయటకివచ్చిన భూతం. అది తిరిగి లోపలికి వెళ్లదు. సిక్కులు, దళితులు, క్రైస్తవుల మీదకు కూడా వచ్చింది. ముస్లింలను ముందే లక్ష్యంగా చేసుకుంది.
 • విద్వేషపు చూపు కశ్మీర్‌తోనే ఆగదు. పాకిస్తాన్‌పైనా పడుతుంది. పుల్వామా ఘటన తర్వాత బాలాకోట్‌పై చేసినట్లుగానే, ‘ఆజాద్ కశ్మీర్‌’పై అంతకన్నా పెద్ద చర్యలు చేపట్టేందుకు వారు ప్రణాళికలు వేసినట్లు మాకు సమాచారం ఉంది.
Image copyright Reuters
 • కశ్మీర్‌పై దృష్టిని మరల్చేందుకు ‘ఆజాద్ కశ్మీర్‌’పై చర్యలు తీసుకోబోతున్నారు. అలా చేస్తే, ఇటుకలకు ప్రతిగా రాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని మోదీని హెచ్చరిస్తున్నా. మేం మీకు గుణపాఠం నేర్పించాల్సిన సమయం వచ్చింది.
 • పాక్ సైన్యంతోపాటు మొత్తం దేశం కూడా పోరాటానికి సిద్ధంగా ఉంది. మీరు చర్యకు ఉపక్రమిస్తే, ఆఖరిదాకా మేం పోట్లాడతాం. అల్లా తప్ప మరెవరికీ మేం తలవంచం. యుద్ధం వస్తే, మొత్తం ప్రపంచమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
 • ప్రపంచ యుద్ధాల తర్వాత మరోసారి అలాంటివి జరగకుండా ఐరాస ఏర్పడింది. కశ్మీరీలకు స్వీయ నిర్ణయాధికారం కల్పించడం సహా ఐరాస భద్రత మండలి చేసిన వివిధ తీర్మానాలను మోదీ తుంగలో తొక్కారు. ఐరాస సభ్య దేశాలు ఆ తీర్మానాలకు కట్టుబడి ఉంటాయా?
 • చట్టం తేగానే కశ్మీరీలు చేతులు కట్టుకుని కూర్చుంటారని అనుకోవద్దు. వారికి చావు భయం లేదు. వాళ్లను మోదీ బానిసలుగా మార్చలేరు. ఐరాసకు అభ్యర్థన పంపాం. అంతర్జాతీయ కోర్టుకు కూడా వెళ్తాం. ప్రపంచంలోని అన్ని వేదికలపైకీ వెళ్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీలు, కశ్మీరీల మద్దతు కూడగట్టుకుంటాం. లండన్‌లో పెద్ద సంఖ్యలో జనాలతో కశ్మీర్ కోసం ఆందోళన నిర్వహిస్తున్నాం. వచ్చే నెలలో ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రారంభమయ్యేప్పుడు గతంలో ఎన్నడూ చూడనంత మందిని చూస్తారు.
 • మోదీ తాజా చర్య తర్వాత కశ్మీర్‌కు విముక్తి లభించాలని అల్లాను కోరుకుంటున్నా. నేను యుద్ధాన్ని నమ్మను. మైత్రి కోసం చాలా ప్రయత్నించా. ఎన్నో అంశాల్లో భారత్‌తో కలిసి పనిచేయాలనుకున్నా. కశ్మీర్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ, పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలన్న ఏకైక లక్ష్యంతో వారున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)