అమెరికా - ఇరాన్ ఘర్షణ: చమురు ట్యాంకర్ల పేలుళ్ళ వెనుక ఇరాన్ హస్తం ఉందన్న అమెరికా... అవి నిరాధార ఆరోపణలని తోసిపుచ్చిన ఇరాన్

  • 14 జూన్ 2019
ఇరాన్-అమెరికా ఉద్రిక్తత Image copyright Reuters

ఒమన్ గల్ఫ్‌లో ‌ఉన్న రెండు ట్యాంకర్లపై రెచ్చగొట్టకుంటానే దాడి చేయడానికి ఇరానే బాధ్యత వహించాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో అన్నారు.

దాడికి ఉపయోగించిన ఆయుధాలు, నిఘా సమాచారాన్ని బట్టి అమెరికా ఈ అంచనాకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

అంతకు ముందు బీబీసీతో మాట్లాడిన ఇరాన్ అధికారి మాత్రం ఈ పేలుళ్లతో ఇరాన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

గురువారం ఉదయం చమురు ట్యాంకర్లపై దాడి జరిగింది. వాటిలోని సిబ్బందిని కాపాడామని ఇరాన్, అమెరికా రెండూ చెబుతున్నాయి.

ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గంలో ఈ పేలుడు జరిగింది.

గురువారం జరిగిన పేలుళ్ల కంటే ముందు సుమారు నెల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన నాలుగు చమురు ట్యాంకర్లపై కూడా దాడి జరిగింది.

మేలో జరిగిన ఈ దాడికి ఏ గ్రూపులు, దేశాలు బాధ్యత తీసుకోలేదు. ఇందులో కూడా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అమెరికా అప్పుడు కూడా ఇరాన్‌పై ఆరోపణలు చేసింది. కానీ ఆ పేలుళ్లలో తమ పాత్ర లేదన్న ఇరాన్ ఆరోపణలను తోసిపుచ్చింది.

ఒమన్ గల్ఫ్‌లో గురువారం జరిగిన దాడి తర్వాత చమురు ధరలు సుమారు నాలుగు శాతం పెరిగాయి.

ఒమన్ గల్ఫ్‌లో ఉన్న హోర్మూజ్ దగ్గర జరిగింది. ఆ మార్గంలో రోజూ లక్షల డాలర్ల చమురు రవాణా అవుతుంది.

Image copyright Getty Images

పాంపేయో ఏం చెప్పారు...

దీనిపై వాషింగ్టన్‌లో మాట్లాడిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్లు భావిస్తున్నామని చెప్పారు.

"నిఘా సమాచారం, ఈ దాడికి ఉపయోగించిన ఆయుధాలు, ఈ ఆపరేషన్ అమలు చేయడానికి ఎలాంటి నిపుణులు అవసరం ఉంటుంది, ఇటీవల ఇరాన్ ద్వారా నౌకలపై జరిగిన ఇలాంటి దాడుల ఆధారంగా మేం ఈ అంచనాకు వచ్చాం. నిజానికి ఈ ప్రాంతంలో ఉన్న ఏ గ్రూపులకూ ఇలాంటి చర్యలకు పాల్పడే వనరులు, నైపుణ్యం లేవు" అన్నారు.

అమెరికా, దాని సహచరుల ప్రయోజనాలపై ఇరాన్, దాని సహచరులు జరుపుతున్న దాడులకు సంబంధించి ఇది తాజా కేసు. ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే జరిగే ఇలాంటి దాడులు అంతర్జాతీయ శాంతిభద్రతలకు చాలా ప్రమాదం. ఇది నౌకారవాణా స్వేచ్ఛపై జరిగిన క్రూరమైన దాడి. ఇది ఇరాన్ వైపు నుంచి ఉద్రిక్తతలు పెంచే చర్యలు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం అని పాంపేయో చెప్పారు.

Image copyright AFP/HO/IRIB

పేలుడు గురించి సమాచారం

'ఫ్రంట్ అల్టయర్‌' అనే చమురు ట్యాంకర్‌పై దాడి జరిగింది, దీనిలో మూడు పేలుళ్లు జరిగాయని నార్వే మారీటైమ్ అథారిటీ గురువారం చెప్పింది.

ఫ్రంట్ అల్టయర్ నౌకను తైవాన్ ప్రభుత్వ చమురు రీఫైనరీ కంపెనీ సీపీసీ కార్పొరేషన్ అద్దెకు నడుపుతోంది. ఇందులో 75 వేల టన్నుల చమురు ఉందని సీపీసీ కార్పొరేషన్ ప్రతినిధి చెప్పారు. టార్పెడో (జలాంతర్గామితో ప్రయోగించే క్షిపణి)తో ఈ దాడి చేశారని భావిస్తున్నారు. కానీ దీనిని ఇప్పటివరకూ ధ్రువీకరించేదు.

ఇది మైన్ అటాక్ కూడా కావచ్చని మరికొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.

మార్షల్ ద్వీపం జెండా ఉన్న పడవలకు నిప్పంటుకుందని ఫ్రంట్‌లైన్ నౌక యజమాని అన్నారు. ఇరాన్ మీడియా మాత్రం అది మునిగిపోయిందని చెబుతోంది. దానిని కంపెనీ కొట్టిపారేసింది.

కొకుకా కొరేజియస్ నౌకలో ఆపరేషన్స్ నిర్వహించే బీఎంఎస్ షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీ దానిలోని సిబ్బంది బయటపడ్డారని, అటుగా వెళ్తున్న ఒక నౌక వారిని కాపాడిందని చెప్పింది.

మరో ప్రతినిధి ఈ ట్యాంకర్లో మిథనాల్ ఉందని, అది మునిగిపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.

Image copyright AFP

నౌకను కాపాడ్డానికి ఎవరొచ్చారు

ఇరాన్ క్రూ నౌకలోని వారిని కాపాడిందని, వారిని జాస్క్ రేవుకు తీసుకెళ్లారని ఆ దేశ మీడియా చెప్పింది. వారిని

మరోవైపు సిబ్బందికి సాయం చేసేందుకు ఘటనాస్థలానికి యూఎస్ఎస్ బైన్‌బ్రిడ్జ్ నౌకను పంపించామని బహ్రెయిన్‌లోని అమరికా ఫిఫ్త్ ఫ్లీట్ చెప్పింది.

"అమెరికా నౌకాదళానికి రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి ఆందోళనగా కాల్స్ వచ్చాయి" అని సైనిక ప్రతినిధి చెప్పారు. దాంతో కొకుకా ట్యాంకర్ సిబ్బందిలో 29 మందిని బైన్‌బ్రిడ్జ్‌లో సైన్యం సురక్షితంగా కాపాడిందని అన్నారు.

Image copyright Empics

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎందుకు

2015లో జరిగిన ఇరాన్ అణు ఒప్పందం నుంచి బయటిరావాలని అమెరికా 2018లో నిర్ణయించింది.

అమెరికా సహచర దేశాలతోపాటు చాలా దేశాలు ఈ చర్యను తీవ్రంగా విమర్శించాయి.

మేలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను కఠినం చేశారు. ఆ దేశంలోని చమురు రంగాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

అణు ఒప్పందం ప్రకారం తాము చేసిన కొన్ని హామీలను వాయిదా వేస్తున్నట్టు తర్వాత ఇరాన్ కూడా చెప్పింది

ఇటీవల కొన్ని నెలల నుంచీ అమెరికా గల్ఫ్‌లో తన సైన్యం మోహరింపు పెంచింది. ఇరాన్ వల్ల తమకు ప్రమాదం ఉంది కాబట్టే అలా చేస్తున్నామని చెప్పింది.

మరోవైపు, అమెరికానే దూకుడుగా వ్యవహరిస్తోందని ఇరాన్ చెప్పింది.

Image copyright EUROPEAN PHOTOPRESS AGENCY

అమెరికా దగ్గర ఎలాంటి నిఘా సమాచారం ఉంది

-జొనాథన్ మార్కస్, రక్షణ ప్రతినిధి విశ్లేషణ

పాంపేయో ఇలాంటి నిర్ణయానికి రావడం చాలా దారుణం. కానీ ఈ పేలుళ్లకు సరైన కారణం గురించి చాలా తక్కువ వివరాలు అందాయి. రెండు ట్యాంకర్లకు జరిగిన నష్టంపై ఫోరెన్సిక్ విశ్లేషణలు చెబుతున్న దానిని బలపరిచేలా అక్కడ వేరే నౌకల కదలిక ఉందనడానికి ఉపగ్రహాలు లేదా వేరే ట్రాకింగ్ సమాచారం కావాలి.

త్వరగా ఒక నిర్ణయానికి రావడం ప్రమాదం అని కొందరు వాదించచ్చు. ఇక అమెరికా స్పందించాలని ముఖ్యంగా సైనికపరంగా స్పందించాలనుకుంటే, అప్పుడు చాలా దేశాలు దాని మిత్ర దేశాలు కూడా అమెరికా దగ్గర దీని గురించి ఎలాంటి కచ్చితమైన నిఘా సమాచారం ఉందో తెలుసుకోవాలనుకుంటాయి అనేది స్పష్టమైంది.

ఇక, ఇరాన్ విషయానికి వస్తే, ఈ ఘటనలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పడం తొందరపాటే అవుతుంది. నిజానికి తమను ఇరికించారని అది వాదించడం వల్ల, తమపై నిందలు రాకుండా చూసుకుంటున్నట్లు అవుతుంది. ఇరాన్ అధికారి "ఇది ఇరాన్, అంతర్జాతీయ సమాజం మధ్య ఉన్న సంబంధాలను బలహీనం చేసే ప్రయత్నం" అని ఆరోపించారు.


దాడిపై స్పందనలు

ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రెస్ గురువారం ట్యాంకర్లలో జరిగిన పేలుళ్లను ఖండించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాట్లాడిన ఆయన ప్రపంచం గల్ఫ్‌లో ఘర్షణలను తట్టుకోలేదని అన్నారు

యూరోపియన్ యూనియన్ రెండు దేశాలూ సంయమనం పాటించాలని అపీల్ చేసింది. అటు రష్యా కూడా ఎవరూ ఎలాంటి నిర్ణయానికీ రావద్దని, పేలుళ్లతో ఇరాన్‌పై ఒత్తిడి కూడా పెట్టకూడదని అంది. ఇరాన్‌ను రష్యా సహచర దేశంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)