తమ్మినేని సీతారాం: శ్రీకాకుళం జిల్లా నుంచి నాలుగో స్పీకర్

  • 13 జూన్ 2019
తమ్మినేని సీతారాం Image copyright ys jagan/fb

ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వరకు నలుగురు స్పీకర్లు శ్రీకాకుళం జిల్లా నుంచే వచ్చారు.

శాసనసభలో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

‘శ్రీకాకుళం జిల్లా స్పీకర్లను ఎక్కువగా అందించిన జిల్లాగా కనిపిస్తుంది. రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న ప్రాంతమిది’ అని ఆయన పేర్కొన్నారు.

Image copyright http://www.rlndce.org
చిత్రం శీర్షిక రొక్కం లక్ష్మీ నరసింహం దొర

ఆంధ్ర రాష్ట్రం నుంచే..

శ్రీకాకుళం జిల్లా నుంచి స్పీకర్ పదవి చేపట్టిన తొలి రాజకీయ నాయకుడు రొక్కం లక్ష్మీ నర్సింహ దొర. స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబంలో జన్మించిన రొక్కం లక్ష్మీనర్సింహ దొర ఆంధ్రాలోని తొలితరం కాంగ్రెస్ నాయకుల్లో ఒకరు.

1955లో శ్రీకాకుళంలోని టెక్కలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు.

ఆంధ్రరాష్ట్ర స్పీకర్‌గా 1953 నుంచి 1955 వరకు నల్లపాటి వెంకట్రామయ్య కొనసాగగా ఆయన వారసుడిగా 1955 నుంచి 19556 వరకు రొక్కం లక్ష్మీ నర్సింహదొర స్పీకర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో ఆయన స్థానంలో అయ్యదేవర కాళేశ్వర రావు ఏపీ తొలి స్పీకర్‌గా నియమితులయ్యారు.

Image copyright www.aplegislature.org
చిత్రం శీర్షిక తంగి సత్యనారాయణ

సర్పంచ్ నుంచి స్పీకర్‌గా...

ఆంధ్రప్రదేశ్ ఏడో స్పీకర్‌గా పనిచేసిన తంగి సత్యనారాయణ కూడా శ్రీకాకుళం జిల్లా నుంచే వచ్చారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 1967, 983లో శాసనసభకు ఎన్నికయ్యారు.

సర్పంచ్‌ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన తంగి పంచాయతీరాజ్ చాంబర్ చైర్మన్‌గా, శ్రీకాకుళం వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు అధ్యక్షులుగా పనిచేశారు. నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగారు.

1983 నుంచి 1984 వరకు ఏపీ ఏడో స్పీకర్‌గా పనిచేశారు.

శాసన సభలో జరిగే చర్చలు ప్రజలకు యధాతథంగా చేరాలని, వార్తా పత్రికలు రాజకీయపరమైన, వ్యక్తిగత రాగద్వేశాలకు అతీతంగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాలను నిష్పక్షపాతంగా ప్రజలకు అందించాలని 1983 సెప్టెంబర్ 19న రూలింగ్ ఇచ్చారు.

Image copyright facebook/kavaligreeshmaprasad
చిత్రం శీర్షిక ప్రతిభాభారతి

తొలి మహిళా స్పీకర్ క్కడి నుంచే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవికి ఎన్నికైన మొదటి మహిళ కావలి ప్రతిభా భారతి కూడా శ్రీకాకుళం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. 11వ శాసన సభకు స్పీకర్‌గా పనిచేశారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన గెలిచిన ఆమె ఎన్టీఆర్ హయాంలో మంత్రిగానూ పనిచేశారు. సాంఘిక సంక్షేమం, గిరిజన, వెనుకబడిన తరగతులు, వికలాంగుల సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమం, గృహ నిర్మాణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు.

చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగానూ పనిచేశారు.

1999 నుంచి 2004 మే 30 వరకు ఏపీ శాసన సభ 11వ స్పీకర్ గా విధులు నిర్వర్తించారు.

2000 సెప్టెంబర్ 13న వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిపై జరిగిన చర్చల సమయంలో ఉదయం 8.30 నుంచి రాత్రి 9.30 వరకు దాదాపు 13 గంటలు శాసన సభను నిర్వహించారు.

Image copyright jagan/fb

తమ్మినేని సీతారాం.. విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నత పదవి వరకు ప్రస్థానం

విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన తమ్మినేని సీతారాం స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తొగరాం గ్రామం.

ఎన్టీయార్ పిలుపుతో టీడీపీలో చేరారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.

ఆరు సార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. విప్‌గానూ బాధ్యతలు నిర్వహించారు.

చంద్రబాబు హయాంలో మంత్రిగా యువజన, మున్సిపల్ , సమాచార, టూరిజం, ఎక్సైజ్ శాఖలను చూసుకున్నారు.

టీడీపీ నుంచి ప్రజారాజ్యంలో చేరారు. అనంతరం మళ్లీ టీడీపీలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో టీడీపీని వీడి వైసీపీకి వచ్చారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమదాలవలస నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. విభజన అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్ రెండో స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు