రూ. 500 కోట్ల కుంభకోణం: యజమాని పరార్... ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినట్లు ఆడియో క్లిప్ వైరల్

  • 13 జూన్ 2019
ఐఏఎం Image copyright BANGALORE NEWS PHOTOS

బెంగళూరులో చిన్న చితకా ఉద్యోగులు, వ్యాపారుల నుంచి పెట్టుబడులు స్వీకరించిన ఐఏఎం జ్యువెల్స్ అనే సంస్థ ఒక్కసారిగా మూతపడింది. ఆ సంస్థ యజమాని మహమ్మద్ మన్సూర్ ఖాన్ పరారయ్యారు. ఆత్మహత్య చేసుకుంటున్నాని ఆయన చెబుతున్నట్లుగా ఉన్న ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది.

దీంతో, లేడీ కర్జన్ రోడ్‌లోని ఆ సంస్థ కార్యాలయం ఎదుట మదుపరులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు.

ఐఏఎం తమను మోసం చేసిందంటూ గత రెండు రోజుల్లో దాదాపు 8 వేల మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కుంభకోణం విలువ దాదాపు రూ.500 కోట్ల వరకూ ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Image copyright BANGALORE NEWS PHOTOS

సంస్థ కార్యాలయం ముందు నిరసన చేపట్టినవారిలో 50 ఏళ్ల అన్సార్ పాషా కూడా ఉన్నారు.

ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.7.5 లక్షలు ఐఏఎంలో చిక్కుకుపోయాయి.

ఐఏఎం నిర్వహిస్తున్న హలాల్ బ్యాంకింగ్ స్కీమ్‌లో గత మూడేళ్లలో పాషా రూ. 10 లక్షలు మదుపు చేశారు.

''నెల నెలా మాకు రూ. 2500 నుంచి రూ. 3000 వరకూ వచ్చేవి. కొన్ని నెలలుగా రూ. 1000 మాత్రమే వస్తున్నాయి. నెలనెలా అందే మొత్తం తగ్గుతూ, పెరుగుతూ ఉంటుందని వారు చెప్పారు'' అని పాషా వివరించారు.

అయిదు నెలల క్రితం పాషా తన పెట్టుబడి మొత్తంలో నుంచి రూ. 2.5 లక్షలు వెనక్కితీసుకున్నారు. ఉన్న డబ్బుపై వచ్చే వడ్డీ మొత్తం ఒక శాతం కన్నా తగ్గిపోవడంతో ఆయనకు దిగులు మొదలైంది.

డబ్బులు పూర్తిగా వెనక్కి తీసుకోవాలని తాను అనుకున్నా, సంస్థ అంగీకరించలేదని పాషా చెప్పారు.

Image copyright BANGALORE NEWS PHOTOS

పరారీలో యజమాని, ఆత్మహత్య హెచ్చరికలు

ఐఏఎం జ్యువెల్స్ సంస్థ ఐఎంఏ గ్రూప్‌లో భాగంగా ఉంది. ఆ గ్రూప్‌కు మన్సూర్ ఖాన్ యజమానిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఒక్కసారిగా అదృశ్యమయ్యారు.

ఐఏఎంలోని మదుపరులకు ఒక శాతం వడ్డీ కూడా రావడం కొన్ని నెలల క్రితం ఆగిపోయింది. రంజాన్ పండుగ తర్వాత నాలుగు రోజులైనా కార్యాలయం తెరుచుకోకపోవడంతో మదుపరుల్లో ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సంస్థ యజమాని ఆడియో క్లిప్ వైరల్ కావడంతో వేల మంది ఆ సంస్థ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

తాను చాలా చిన్నవ్యాపారినని, ఐఏఎంలో పెట్టిన మూల ధనమైనా తిరిగి రావాలని కోరుకుంటున్నానని సయ్యద్ రఫీక్ అనే వ్యక్తి అన్నారు.

ఆయన సంస్థలో రూ.లక్ష మదుపు చేశారు.

తమ కుమార్తె పెళ్లి కోసం ఐఏఎం హలాల్ బ్యాంకింగ్ స్కీమ్‌లో చేరానని, కుమారుడి చదువు కోసం మరో స్కీమ్‌లో డబ్బులు పెట్టామని భారతీ మనోహర్ అనే మహిళ వాపోయారు.

Image copyright BANGALORE NEWS PHOTOS

పదేళ్లుగా సంస్థ కార్యకలాపాలు

భారతి భర్త ముస్లిం. వారికి ఇస్లామిక్ బ్యాంకింగ్ పట్ల ఆసక్తి ఉంది. ఐఏఎం సంస్థ ఇస్లామిక్ బ్యాంకింగ్ సూత్రాలతో పనిచేస్తోంది.

అయితే, ఐఏఎం నుంచి అకస్మాత్తుగా డబ్బులు ఆగిపోవడంతో ఆందోళనకు గురయ్యామని భారతి అన్నారు.

''ఎలాంటి కలవరమూ అవసరం లేదని సంస్థ అధికారులు చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత, ఎప్పటిలాగే డబ్బులు వస్తాయన్నారు. అందుకే, మేం డబ్బు వెనక్కితీసుకోలేదు'' అని ఆమె వివరించారు.

మన్సూర్ ఖాన్ ఆడియో క్లిప్ బయటకు వచ్చిన తర్వాత పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.

ఐఏఎం వ్యవహారం గురించి బెంగళూరు ఈస్ట్ అదనపు కమిషనర్ సీమంథ్ కుమార్ సింగ్ బీబీసీతో మాట్లాడారు.

''బాధితుల ఆందోళన, ఆగ్రహాలను మేం అర్థం చేసుకున్నాం. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం'' అని అన్నారు.

ఐఏఎం సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గోల్డ్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రియల్ ఎస్టేట్, ఫార్మాసూటికల్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెడుతూ వస్తోంది.

నగరంలో పదేళ్ల కన్నా ముందు నుంచే ఆ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ముందు ఎన్నడూ వారిపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పారు.

Image copyright TWITTER @SEEMANTH KUMAR SINGH
చిత్రం శీర్షిక బెంగళూరు ఈస్ట్ అదనపు కమిషనర్ సీమంథ్ కుమార్ సింగ్

ఎమ్మెల్యేపై ఆరోపణలు

యజమాని మన్సూర్ ఖాన్ ఎక్కడున్నారన్న విషయం తమకు కూడా తెలియదని కంపెనీలో డైరెక్టర్లు చెబుతున్నారు.

మన్సూర్ ఖాన్ ఒక్కడే స్వయంగా కార్యకలాపాలు చూసుకునేవాడని డైరెక్టర్లు చెబుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.

మన్సూర్ ఖాన్‌దిగా చెబుతున్న ఆడియో క్లిప్‌లో... అధికారులు, శివాజీనగర్ ఎమ్మెల్యే రోశన్ బేగ్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాననే వ్యాఖ్యలు ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ. 400 కోట్లు ఇవ్వాలని బేగ్ తనను వేధించారని మన్సూర్ ఇదివరకు ఆరోపణలు చేశారు.

అయితే, కాంగ్రెస్‌కు చెందిన రోశన్ బేగ్ ఈ ఆరోపణలను ఖండించారు. తమ ప్రాంతంలో ఓ పాఠశాల తెరిచినందుకే తనకు ఐఏఎం గ్రూప్ గురించి తెలిసిందని ఆయన అన్నారు.

''ఐఏఎం గ్రూప్ ఆస్తులను లెక్కగడుతున్నాం. వీటిని విక్రయించి, మదుపరులకు డబ్బు చెల్లించేందుకు కోర్టును అనుమతి కోరుతాం'' అని కమిషనర్ సీమంథ్ కుమార్ సింగ్ చెప్పారు.

మన్సూర్ ఖాన్ మిడిల్ ఈస్ట్ దేశాలకు పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన్ను ఎలాగైనే పట్టుకుంటామని చెప్పారు.

ఐఎంఏ జ్యువెల్స్ కుంభకోణంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించినట్లు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విటర్‌లో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)